RSS

నాన్న ...బ్లాగింగ్ చేయక చాల రోజులు అయ్యింది..ఈ రోజు కొంచెం ఫ్రీ గా ఉన్నట్లు అనిపించి అది నాన్న మీద రాద్దాము అని మొదలు పెడుతున్నాను


నా పదో తరగతి అయ్యేంతవరకు నాన్న అంటే వణుకు..భయం..ఇంకా ఏదన్న ఉంటే అంతకంటే ఎక్కువే ..తరువాత డిప్లొమా..ఇంజనీరింగ్ ..ఇది అయ్యేంతవరకు కూడా నాన్న అంటే భయం ..ఎదురుగా కూర్చుని మాట్లాడాలంటే ఏదో తెలియని తత్తర పాటు ..ఏది కావాలి అన్న అమ్మే చెప్పాలి ..నువ్వు ఎందుకురా నాతొ మాట్లాడవు అంటే ఇది కారణం అని చెప్పలేని అసయాత..నువ్వు ఇదే చదవాలి అంటే నో నేను అది చదవును ఇదే చదువుతాను అని గట్టిగా చెప్పలేని భయం అమ్మ కు చెపితే నాన్న నీ మంచికే కదా చెప్పేది విను అనేది..ఒక్కడినే కాబట్టి గారాబం చేస్తే చెడిపోతాను అని భయమో..లేక గాంభీర్యం నటించే వారొ తెలియదు కానీ నాతో పట్టుమని పది నిమిషాలు నువ్వు ఏమి చదువుదాము అనుకుంటున్నావు అని అడిగేవారు కాదు ..ఏదో అలా అలా చదువు ముగిసిపోయింది..ప్రోగ్రెస్ రిపొర్టు లో మార్కులు తక్కువ వస్తే ఎలా చూపించాలని నాన్న సంతకం నేనే పెట్టటం ఆ సంగతి ఇంట్లో తెలియటం.. హమ్మో ఇప్పుడు ఇంటికెళితె ఇంకేమన్న ఉందా ఉతికి ఆరెయ్యరు అని మనం ఇంటికి వెళ్ళకుండా బెజవాడ వెళ్ళటం ..దాంతో ఇంట్లొ వాళ్ళు నాకోసం వెతకటం..మొత్తానికి ఇంటికి రావటం అన్ని ఇంకా తడి ఆరని గుర్తులే..ఇంటికొచ్చాక తెలిసింది నాన్నకి నా మీద ఎంత ప్రేమ ఉందో..ఎవరెస్ట్ అంత ప్రేమ ఉంచుకుని పైకి గాంభీర్య ప్రద్రర్శిస్తున్న నాన్న చూసి మా నాన్న సూపర్ అనుకున్నా..అయినా భయం మాత్రం ఇంకా తగ్గలేదు..
కాలేజీ రోజుల్లో ఇంటికి వచ్చే తిరిగి వెళ్ళేటప్పుడు నాన్న ఖర్చులకు డబ్బులు ఇవ్వండి అంటే లేదు పద కాలేజీకి నేను వస్తున్నా..మీ హెడ్ తొ మాట్లాడాలి ఎలా ఉంటున్నావో కాలేజ్ లో అంటే నాకు చచ్చే వణుకు వచ్చేది ఎక్కడ వస్తారో ..అని వస్తే మన వేషాలు అన్ని తెలిసిపోతాయి కద మరి ..చివరికి లాస్ట్ మినిట్ లో డబ్బులు అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చి పంపేవారు..పాపం అమ్మ ఎందుకు అన్ని డబ్బులు అన్నా వినకుండా..(కాలేజ్ లో జాయిన్ చేసిన రోజు వచ్చిన నాన్న మళ్ళీ కాలేజ్ వంక చూడలేదు)..చదువు అయిపోయి జాబ్ లొ జాయిన్ అయి అది వదిలేసి మీడియాలోకి వచ్చిన నన్ను చూసి బాధపడ్డారు తప్ప ఒక్క మాట అనలేదు..నీ చదువుకి చేస్తున్న ఉద్యోగానికి ఎమన్న సంబంధం ఉందా అన్న మాట తప్ప.. కూడా నేను కూడా నాన్నఅయినా ఇప్పటికి నాన్న బాధ ఒక్కటే .నా భవిష్యత్తు గురించే...నేను ఓ తండ్రి అయినా ఇంకా నా గురించి పడే తపన చూస్తే ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను ..ఒక్క ఐ లవ్ యూ డాడీ అని చెప్పటం తప్ప..

 • Digg
 • Del.icio.us
 • StumbleUpon
 • Reddit
 • RSS

ప్రేమ బదిలీ వయా కొడుకు టూ మనవడు


ఏమ్మా….జాగ్రత్తగా వెళ్ళు.. వేళకు తిను. ఏంటో ఈ రోజు బాగా గుర్తు వస్తున్నావు రాఇలాంటి మాటలు అమ్మ చెపుతుంటే ఏమ్మా రోజు నా గురించే ఆలోచనేనా! .. నీ ఆరోగ్యం గురించి ఆలోచించవా.. టైం కి డాక్టర్ దగ్గరకు వెళ్ళు అని చెప్పేవాడిని .. దూరప్రాంతంలో ఉద్యోగం చేసే వాళ్ళు పేరెంట్స్ చూసి తిరిగి వెళ్ళేటప్పుడూ వాళ్ళు ఎంత బాధపడతారో మొదటిసారి నాకు అనుభవంలోకి వచ్చింది.. నాకు కొడుకు పుట్టి వాడిని చూసి తిరిగి వెళ్ళేటప్పుడూ నేను పడిన వేదన స్వంతంగా నేను అనుభవిస్తే తప్పా

ఇప్పటివరకు నాకు ఉన్న ఆలోచలను మార్చి వేసింది.. అప్పుడే నా జీవితంలోకి వచ్చిన వాడిని వదిలి ఉండలేక పోతుంటే.. ఇరవై తొమ్మిది సంవత్సరాలు నా మీదనే పంచప్రాణాలు పెట్టుకున్న మా అమ్మా నాన్న నన్ను ఎంత మిస్ అవుతున్నారో ఇప్పుడు అర్ధం అవుతుంది.. కానీ ఏమి చేస్తాం.. మనం అనుకున్న లక్ష్యాలు చేరాలంటే ఇటువంటివి ఓర్చుకోక తప్పదు మరి అయినా మా అబ్బాయిని ఎవరి దగ్గర వదిలి వచ్చాను అమ్మకు దగ్గరగానేగా.. తన రక్తం పంచుకుపుట్టినా నన్ను ఎంత ప్రేమ గా చూసుకుందో దానికి రెట్టింపు ప్రేమతో నా రక్తం పుట్టిన వాడిని చూసుకుంటుంది గా సో నో వర్రీస్ .. అమ్మా యూ రాక్స్..


 • Digg
 • Del.icio.us
 • StumbleUpon
 • Reddit
 • RSS

మహిళా నీకు వందనంమార్చి ఎనిమిది ఈ  రోజు ప్రపంచ మహిళా దినోత్సవం..సరిగ్గా నేటికి వందసంవత్సరాలు పూర్తి చేసుకుంది..వందేళ్ళూ పూర్తి  చేస్తుకున్న మహిళలు పరిస్థితులు మారాయా అంటే ఖచ్చింతగా మారలేదని చెప్పవచ్చు..బాగా చదువుకుని  కార్పోరేట్ కంపెనీలో పని చేసే అమ్మాయి అయినా ..చదువు కొనలేక పని పిల్లగా పని చేసే అమ్మాయి అయినా ఎదుర్కోనే ఇబ్బందులు ఒక్కటే ..లైంగిక వేదింపులు.కట్న పిశాచుల ఆగడాలు.. సైకో ప్రేమికుల శాడిజానికి  ఎవరైనా బలవ్వాల్సిందే ...నిజానికి ఆకాశంలో సగం ..అన్నింటిలో సగం అని చేప్పే ఆడవాళ్ళు సమస్యలు వచ్చినప్పుడూ మాత్రం బేలగా మారతారు..తమకు వచ్చిన ఏ ఆపదలను ఎవరితోను చెప్పుకోరు ..వారిలో వారే కుమిలిపోతుంటారు,ఉదయం ఉద్యోగానికి సిటి బస్ ఎక్కితే రద్దీ ని అడ్డుపెట్టుకుని ఆనందించే వారు కొందరు అయితే ..ఆఫీసులో వేసే డబులు మీనింగ్ డైలాగ్స్ వేసి ఆనందించే వారుమరి కొందరు ..ఎవరు ఎమన్నా..ఎవరు ఏమి చేసినా  ఒంటీ మీద తేళ్ళూ జేర్రులు పాకుతున్నట్లు ఉన్నా సహనంగా ఉండటం మీకు మాత్రమే సొంతం.వంటింటిని అలంకరించిన పరికరంలాగా మారిన జాతి గొంతు పెగుల్చుకొని, స్వంత అస్తిత్వాన్ని చాటుకునే క్రమంలో ఇప్పుడొక చేయూత కావాలి. సంకెళ్ళు తెగతెంచుకునే పోరాటంలో ఇప్పుడొక బాసట కావాలి.

వ్యక్తిత్వం చాటుకునే తరుణంలో ఇప్పుడొక దన్ను కావాలి. అందుకే మార్చి 8 పైనా, మహిళా సాధికారత పైనా చర్చోపచర్చలు, ప్రశ్నోపప్రశ్నలు.
‘మహిళా సాధికారత’ అంటే ”సమాజంలో మహిళలకు సముచితస్థానం కల్పించడానికి విధానాలలో మార్పుతేవడం మాత్రమే కాదు, సమాజ వైఖరిలోనూ మార్పు రావడం.”మానవాభివృద్ధి నివేదిక ప్రకారం ”మహిళా సాధికారత అంటే మహిళలు కుటుంబంలో, సమాజంలో, రాజకీయ రంగంలో చురుకైన నిర్ణాయక పాత్రను నిర్వహించడం.”ఆ దిశగా అడుగులు ఇప్పుడిప్పుడే వేస్తున్నారు ..దానికోసం మహిళను చూసే దృష్టిలో మార్పు కోసం మహిళలే కాదు మహిళాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాల్సి ఉంటుంది.14 ఏళ్ళుగా పురిటి నోప్పులు పడుతున్న మహిళా బిల్లుకి ఈ సంవత్సరం అన్నా మోక్షం లభిస్తుందో లేదో చూడాలి..
అయినా  ప్రపంచాన్ని మహిళలు నడిపిస్తే కనుక… ఎక్కువ ఖర్చు ఆయుధాల మీద, సైన్యం మీద పెట్టరు. శాంతికోసం పెడతారు. కన్నబిడ్డలు ప్రాణాలు కోల్పోవడం ఏ తల్లి చూడగలుగుతుంది?.అందుకే .ఓ మహిళా అందుకో మా వందనం

 • Digg
 • Del.icio.us
 • StumbleUpon
 • Reddit
 • RSS

శివోహం ..శివోహం..
శివరాత్రి ... పండుగ అనగానే మనసు జెట్ కంటే వేగంగా వెనుకకు పరిగెత్తింది..నా చిన్నప్పుడు ఈ పండుగ మా ఊరిలో చాలా బాగా జరిగేది..అంటే ఇప్పుడు కూడా జరుగుతుంది కానీ అప్పటిలా ఎవరు ఈ తిరునాళ లో(ఒక్కొ ప్రాంతంలో ఒకలా పిలుస్తుంటారు ) పాల్గోనటం లేదు మా ఇంటి కి దగ్గరలోనే కృష్ణానది ఉత్తరానికి పారేది... .
.ఆ పక్కనే శివాలయం ఉండేది..ఆ రొజు తెల్లవారుజామునే నిద్ర లేచి అమ్మ తో కలిసి నదీ స్నానానికి వెళ్ళేవాడిని ..నదీ స్నానం అంటే నేను ఏదో తెగ ఈత గట్రా కోట్టే వాడిని అనుకుంటున్నారా..మనకి అంత సీన్ ఎక్కడ ఏడ్చింది ..మా అమ్మ పక్కన రెండు మూడు మెట్లు దిగి మూడు మునకల స్నానమే ..అది కానిచ్చి నిదానంగా బయటకు వచ్చి హడావుడిగా గుడిలోకి పరుగుతీసేవాళ్ళము ..లేకపోతే గుడిలో జనం పెరిగి అయ్య గారు కూడా పూజ సరిగా చేయరని ముందుగానే పూజా కార్యక్రమాలు..ప్రసాదాలు పనులు పూర్తి చేసుకుని నిదానంగా బూరలు అవి కొనుక్కోవటానికి వెళ్ళేవాళ్ళం ..ఈ లోపు అమ్మ మిగతా దేవుళ్ళకు కూడా కోరికల లిస్ట్ చెప్పేసి ఇంటికి తీసుకేళ్ళేది ..ఇక మధ్యాహ్నం నుండి ప్రెండ్స్ అందరం బయలు దేరేవాళ్ళం ..అప్పట్లో మా బ్యాచ్ మొత్తం 15 మంది ఉండే వాళ్ళం .ఆడినా పాడినా ఏమి చేసినా ఈ పదిహేను మందే ..ఇంకో గంటలొ బయలు దేరాతాము అనగా అందరం సైకిళ్ళ అన్నింటికి పుల్ గా ఆయిల్ .వేసి .గాలి అవి సరిగా ఉన్నాయో లేదో చూసుకుని ఒక్కొ దానికి ఇద్దరేసి చొప్పున రిం రిం జిం అనుకుంటూ ఉషారుగా వెళ్ళే వాళ్ళం ...తిరునాళ అంతా తిరిగి చివరికి ఒక చిట్టి కప్ప ..బాగా శబ్దం వచ్చే బూర లు కొనేవాళ్ళం..కొంతమంది చేతివాటం చూపించేవాళ్ళూ ..

చివరికి అలసి సొలసి ఒక కలర్ సోడానో లేక పుల్ల ఐసో తిని బెల్లం చెరుకు గడలు కోనుక్కొని ..ఆ పక్కనే ఉన్న రాజా గారి కోటలొ ఎవరూ చూడకుండా తిరిగి చీకటి పడుతుందనగా ఇంటికి చేరే వాళ్ళం.

.కొంచెం పెద్ద అయిన తరువతా మా ఊరికి కోంచెం దూరంగా ఉన్న గ్రామంలో కూడా పండుగా బాగా జరిగేది ..పండుగ అనే కంటే అక్కడ మసాలా (అదేనండి రికార్ఢింగ్ డ్యాన్య్సులు ) ఉండేది దాంతొ అక్కడ ఇసుకేస్తె రాలనంత జనం ఉండేవాళ్ళూ అయినా మేము మాత్రం ఎవరన్నా గుర్తు పడతారేమో అన్నట్టూ ముఖానికి రుమాలు కట్టుకుని తిరిగేవాళ్లం..చివరికి ఈ సంగతి ఇంట్లొ తెలిసి కొందరికి వీపు విమానం మోతలు ..మరి కొందరికి చెవులు చిల్లులు పడేలా తిట్లు (దీనిలో నాది ఏది అని మాత్రం అడక్కండి) ..ఇక ఆ తరువాత అందరు పై చదువులు అంటూ వేరు వేరు ఊర్లకు వెళ్ళటం..ఆపై ఉద్యొగాలు అంటూ ఇంకా దూరప్రాంతాలకు పొవటం వల్ల అసలు ఇప్పుడు మా స్నేహితుల్లో ఈ పండుగ గురించి ఆలొచించటమే మానేసారు .ఒక వేళ ఒకరిద్దరు వచ్చిన ఇప్పుడు ఇంటికే పరిమితమవుతున్నారు..అయినా ఇప్పటికి అక్కడ పుల్ల ఐస్ దొరుకుతుంది ..కలర్ సొడా అమ్ముతున్నారు ..అవి తినే..తాగే సాహసం చేయగలమా..ఎందుకంటే జీవన విధానం మారింది ..క్వాలిటీ వాల్స్ ముందు పుల్ల ఐస్ ,పెప్సి కోలాలు ముందు కలర్ సోడాలు అనటం లేదు ఇంట్లొ పాత డబ్బా వేసి తిన్న పీచు మిటాయి అనుభూతి మెక్ డోనాల్డ్ లో వంద రూపాయిలు పెట్టి తిన్న పిజ్జా కూడా ఇవ్వదు..నాకు కానీ టైం మిషన్ దొరికితే ఎంచక్కా నా బాల్యానికి వెళ్ళిపోతాను ..అక్కడ ఈ హిపోక్రసి లు ..ఉండవు ఎంచక్కా కర్రా బిళ్ళా,గోలీలు ఆడుకోవచ్చు

 • Digg
 • Del.icio.us
 • StumbleUpon
 • Reddit
 • RSS

మా నెట్ సెంటర్ కధలు

అవి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అయిపోయి ..మూడో సంవత్సరం లోకి వెళ్తున్న సమయం..అప్పుడు మా బ్యాచ్ కి ఓ అద్బుతమైన ఐడియా వచ్చింది ..ఆ ఐడియా మా అందరిని టాటా ..బిర్లా చేస్తుందని అనుకున్నాము మా కాలేజ్ కి దగ్గరలో ఒక ఇంటర్నెట్ సెంటర్ పెట్టాలని..

క్లాస్ లు బంక్ కొట్టిన వాళ్ళు ..ఊసుపోక నెట్ ముందు కూర్చునే వాళ్ళు ...ఇంటర్నెట్ సెంటర్ ని బెడ్ సెంటర్ గా ఫీల్ అయ్యే వాళ్ళు విచ్చల విచ్చల విడిగా వస్తారు ...ఇక మనకి డబ్బులే డబ్బులే అనుకుని ప్రణాళికలు రచించాము..ఇంతకీ ప్లాన్ ఒకే ..కానీ కాసులు ఎక్కడనుండి వస్తాయి..దీనిపై రెండు మూడు రోజులు స్లీప్ లెస్ నైట్స్ గడిపి మరి ఓ దిక్కుమాలిన (కెసిఆర్ గారు క్షమించాలి మీ పదం వాడుకున్నందుకు )ఆలోచన చేసాము..అదేమిటంటే మళ్ళి కాలేజ్ కి వచ్చినప్పుడు ఎలాగు ఫీజ్ కట్టాలి కాబట్టి ..దానిలో సగం కట్టి మిగతా సగం ఇంటర్నెట్ సెంటర్ లో పెట్టుబడి పెట్టాలని డిసైడ్ చేసుకున్నాము..సెలవులకు ఇంటికి బయలు దేరేముందు చేసిన బాసలు మారిపోయాయి ..

మళ్ళి తిరిగి కాలేజ్ కి వచ్చే సరికి కొందరు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు..తప్పుకున్న వారిలో నేను ఒకడిని..నాకు ఎందుకో ఈ ప్లాన్ వర్కౌట్ కాదు అనిపించి బస్సు దిగి నేరుగా బ్యాంక్ కి వెళ్లి ఫీజ్ కట్టి మరి ప్రాజెక్ట్ సైట్ కి వెళ్లాను ..ఇంతకీ మేం నెట్ సెంటర్ పెట్టాలి అనుకున్నది ఎక్కడో చెప్పలేదు కదా ..సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే కెసీపి కాలనీ అని ఉండేది ఆ కాలనీ స్టార్టింగ్ లో ..ఓ పక్క కిరాన షాపు..మధ్యలో మా నెట్ కేఫ్ ..అ పక్కన చిన్న హోటల్
ఎవడన్నా హోటల్ పక్కన నెట్ సెంటర్ పెట్టాలని ఆలోచిస్తారా ..కానీ మేం పెట్టేసాం..మొత్తానికి నలుగురు అనుకుంటా(పేర్లు రాయలనే ఉంది కానీ కానే ఎందుకో రాయలేక పోతున్నాను ) ..వారి పెట్టుబడితో షాపు రిమోడలింగ్ కి సిద్దం అయ్యింది..కాలేజ్ లంచ్ బ్రేక్ లో రావటం..పనులు పర్యవేక్షిచటం ..మళ్ళి లాబ్ కి వెళ్ళటం అలా అలా ఒక రెండు నెలలకి పనులు పూర్తి అయి నెట్ సెంటర్ ఓపెనింగ్ కి సిద్దం అయ్యింది..ఈ లోపు నెట్ సెంటర్ చూడటానికి వచ్చిన మిత్రుల కోసం చేసిన సేవలకి ఆ పక్కన హోటల్ లో బిల్లు కూడా తడిచి మోపెడు అయ్యింది ..రోజు హై పిచ్ సౌండ్ తో సింహాద్రి సినిమా పాటలు(ఆ సమయం లో నే ఆ పాటలు రిలీజ్ అయ్యాయి ) వినటం.. సరే నెట్ సెంటర్ ఓపెన్ చేసి రోజులు గడుస్తున్న కంప్యుటర్ ముందు మేం పది మంది తప్పితే ఒక్కడన్నా కొత్త వాడు వస్తే ఒట్టు ..వచ్చిన ప్రతి వాడు మామ ఒక పది నిమిషాలు నెట్ ఇవ్వరా మెయిల్స్ చూసుకుంటా ..ఇప్పడు ఆలోచిస్తే అర్ధం అవుతుంది ..అసలు మనకి ఆ టైం లో మెయిల్స్ పంపే వాడు ఎవడున్నాడు అని... ఏంట్రా ఇలా అయ్యింది అని ఆలోచించి ..చించి మనం నెట్ సెంటర్ ముందు కూర్చుంటే అమ్మాయిలు రావటానికి ఇబ్బంది గా ఉన్నట్లు ఉంది అని మేం సిట్టింగ్ ప్లేస్ మారిస్తే.. కొంచెం బెటర్ ..జనాలు రావటం మొదలు పెట్టారు ..అది ఎంత అంటారా మొదటి నెల సంపాదన ఖర్చులు పోను పదినేను వందల రూపాయిలు ..రెండో నెల ఎనిమిది వందలు ..ఇక మూడో నెల ఒక అమ్మాయి ని పెట్టినా వర్కౌట్ కాలేదు ..ఇక పెట్టుబడిదారులు గుండెల్లో రైళ్ళు పరిగెత్తి ఏకగ్రీవ తీర్మానం చేసి మరి నెట్ సెంటర్ ని అమ్ముకుని ఏదో తిప్పలు పడి ఫీజ్ కట్టి నాలుగో సంవత్సరానికి వెళ్ళాము .అప్పుడు తెలిసింది ..అతిగా ఆశ పడే వాడు సుఖ పడినట్లు చరిత్రలొ లేదని...

పిఎస్: ఈ నెట్ సెంటర్ పుణ్యమా ..ఫైనల్ ఇయర్ కి మా బ్యాచ్ విడిపోయింది ..ఎవరికీ నచ్చిన వారితో వారు వెళ్లి పోయారు ..ఇద్దరితో నేను ఉండి పోయాను ..వారిలో ఇద్దరు నెట్ సెంటర్ లో పెట్టుబడిదారులు ..వారిలో ఒకరు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు మరొకడు టి.సి.ఎస్ లో వర్క్ చేస్తున్నాడు .

 • Digg
 • Del.icio.us
 • StumbleUpon
 • Reddit
 • RSS

నయా దోస్తానా

కాంగ్రెస్.. ప్రజా రాజ్యం పార్టీ నయా దోస్తానా కి రంగం సిద్దం అయ్యింది..రోజుకో సమస్యతో నీరసించిన కాంగ్రెస్ పార్టీకి చిరు ఆపాద్భాందవుడిలా కనిపించాడు..తమతో కలిసి పని చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి అంటోని ద్వారా సమాచారం అందించింది..ఇప్పటికే జగన్ వర్గం తమ మీద చర్యలు తీసుకోమని బహిరంగ సవాల్ విసురుతున్న నేపధ్యంలో తమ తదుపరి వ్యుహ్యం ఏమిటో కాంగ్రెస్ అధిష్టానం జగన్ వర్గానికి చెప్పకనే చెప్పింది..కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వెళ్ళిన జగన్ పార్టీ పై ..అధినేత్రిపై రోజుకో విమర్శ చేస్తూ..పార్టీ టిక్కెట్ మీద గెలిచిన ఇరవై కి పైగా ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవటాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది..తాము సోనియా బొమ్మ మీద గెలవలేదని నేరుగా సోనియా పై ఆరోపణలు గుప్పించిన పార్టీ మౌనంగా ..సమయం కోసం వేచి చూసింది..ముందుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో నైతిక విలువలుంటే కాంగ్రెస్ కి రాజీనామా చేసి గెలవాలని చెప్పించింది....అయినప్పటికీ జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఎవరు రాజీనామా చేయకపోవటం తో కాంగ్రేస్ పార్టీ యే వారిపై చర్య తీసుకోవాలని నిర్ణయానికి వచ్చింది ..దీనిలో బాగం గానే జగన్ కి బహిరంగ మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు కొంతమంది పై అనర్హత వేటు వేయాలని బావిస్తుంది...ఒకవేళ జగన్ వర్గానికి చెందిన కొందరి మీద చర్య తీసుకుంటే మిగిలిన వారు మూకుమ్మడి రాజీనామాలు చేసే అవకాశం ఉన్నందున ప్రజారాజ్యం మద్దతు అవసరంమని కాంగ్రెస్ అధిష్టానం బావించింది ..అందులో బాగం గానే ముందుగా కోర్ కమిటీ సభ్యుడు అంటోని వచ్చి మరి చిరు తో మంతనాలు జరిపాడు.ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్ ౩ లేదా నాలుగు బెర్తులు ఇస్తామని .భవిష్యత్తులో రాజ్యసభ సీట్ ఇస్తామని కూడా చిరంజీవికి అంటోని హామీ ఇచ్చాడు..బడ్జెట్ సమావేశాలకు ముందే ప్రజరాజ్యాన్ని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ఆ తరువాత జగన్ వెంట నడిచిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన అని విశ్వసనీయ వర్గాలు చెపుతున్నాయి... ప్రస్తుతానికి పీఅర్పీని మంత్రివర్గంలో తీసుకున్నప్పటికీ 2014 ఎన్నికల్లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే ప్రతిపాదనను కూడా అంటోని చిరంజీవి ముందు ఉంచాడు ..ఈ విషయాలపై నేరుగా డిల్లీ వచ్చి సోనియా తో మాట్లాడ వచ్చని అంటోని చిరుకి చెప్పారు..
మొత్తం మీద జగన్ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ మీద పడకూడదని దానికోసం బలమైన ఓటు బ్యాంకు ఉన్న చిరంజీవిని తమతో కలుపుకు పోవాలని దాని ద్వారా పార్టీ మరింత పటిష్టమవుతుందని కాంగ్రెస్ నేతలు బావిస్తున్నారు ..అందుకే చిరంజీవికి మంత్రిపదవి ఆశ చూపి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసారు .మరో వైపు ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా దేశ అంతర్గత భద్రత పై జరిగే సమావేశం లో పాల్గొనటానికి డిల్లి వెళ్ళినప్పటికీ కీలకమైన నేతలతో మంతనాలు జరిపారు ..సోనియా రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ ని కలిసి భవిష్యత్తు రాజకీయ పరిణామాలు చర్చించారు...వీరిద్దరి మధ్య కడప ,పులివెందుల ఉపఎన్నికల్లో ప్రజారాజ్యం మద్దతు తీసుకునే అంశం చర్చకు వచ్చింది ..రాబోయే రోజుల్లో ఒకే "చిరు బాణం "తో జగన్ ,టిడిపిని దెబ్బ కొట్టాలన్నదే కాంగ్రెస్ వ్యూహం గా కనబడుతుంది..దాని కోసం కాంగ్రెస్ పార్టీ చాచిన స్నేహహస్తం అందుకోవటానికి చిరంజీవి సిద్ధం అయిపోయారు ..సో ఇక మంత్రి వర్గం లోకి చిరు టీం ఇన్ కి ...కాంగ్రెస్ నుండి జగన్ వర్గ ఎమ్మెల్యేలు అవుట్ కి ముహూర్తం దాదాపుగా ఖరారు అయినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. .
-

 • Digg
 • Del.icio.us
 • StumbleUpon
 • Reddit
 • RSS

గుర్తుకొస్తున్నాయి..
ఈ రోజు నా పర్సనల్ ఫైల్ సర్ధుతుంటే ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్ ఫీజ్ రశీదు దొరికింది..అది చూసిన తరువాత మరో సారి గుర్తుకు వచ్చింది..ఇంజనీరింగ్ అయిపోయి అప్పుడే ఐదు సంవత్సరాలు అయ్యిందని..కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది.. నాకు మాత్రం కాలేజ్ అనుభూతులు ఇంకా రోజుకొకసారి పలకరిస్తూనే ఉన్నాయి..డిప్లొమా చదివిన వారికి నేరుగా రెండో సంవత్సరం లోకి వెళ్ళే అవకాశం ఉండటంతో జాలీ..జాలీగా మొదటి రోజు వెళ్ళిన నాకు సీనియర్లు ఎవరూ ఎదురుపడలేదు.. నన్ను పిలిచి ర్యాగింగ్ చేయనందుకు తెగ ఫీల్ అయ్యాను ..రెండో రోజు క్లాస్ లో అడుగు పెడుతుంటే..హలో ఇక్కడ సీనియర్లు చాలా మంది ఉన్నారు కనపడటం లేదా అన్న పిలుపుతో ..బాబు ఆ పిలుపు కోసమే యెదురుచూస్తున్న అంటు పరుగులు తీస్తూ వాళ్ళ ముందు వాలిపోయాను..ఏమ్మాఈ ఇయర్ ..అంటే సెకండ్ ఇయర్ అంటే.అవునా నీ పేస్ ఎప్పుడూచూడలేదే అని క్వచ్చన్ మార్క్ ఫేస్ పెడితే నేనే చెప్పాను.. బాబు నేను డైరెక్ట్ సెకండ్ ఇయర్ కి వచ్చాను అని ..సో ..ఎస్.డి (సెల్ఫ్ డిటైల్స్ ) చెప్పు అంటే బాసు సెకండ్ ఇయర్ వాడిని ర్యాగ్ చేయటం బాగోదు సరదాగా క్యాంటిన్ కి వెళ్లి టీ తాగుతూ మాట్లాడుకుందాము అని డైలాగ్ వేసా.. దానికి వాళ్ళకి వచ్చిన కోపానికే కనుక పవర్ ఉంటే ఈ పోస్ట్ రాయటానికి నేను ఉండేవాడిని కాదేమో ..ఈ లోపు అటు వైపు మా ప్రిన్సిపాల్ వస్తే అందరు హడావుడిగా వెళ్ళిపోతే ఇక నేను మా క్లాస్ లోకి అడుగు పెట్టా..మంది ఎప్పుడూ లాస్ట్ బెంచ్ కాబట్టి అటు వైపు అడుగులు వేస్తే ఆ బెంచ్ కి పుల్ గిరాకీ ..మనలని రానిస్తే కదా..సర్లే రేపు ముందు వచ్చి బ్యాక్ సెటిల్ అవ్వవచ్చు అన్న దీమాతో వెనుకనుండి రెండో బెంచ్ లో సిట్టింగ్ వేసా..సీట్ దొరికిందన్న ఆనందంలో ఇక నా చూపు కలరింగ్ (అదే నండి అమ్మాయిల) వైపు మరలింది..ఓ మోస్తరు గా ఉన్న అమ్మాయిలు మొత్తం మా క్లాస్ లో పదిమంది ఉండే వాళ్ళు ..అలా రెండు క్లాస్ లు అయిన తరువాత లంచ్ చేసిన తరువాత ఏమి చేయాలి అని ఆలోచిస్తుంటే నా బెంచ్ మేట్ ఒక బ్యాచ్ దగ్గరరికి తీసుకెళ్ళి పరిచయ కార్యక్రమం పెట్టాడు ..వాళ్ళందరూ నన్ను తమ గ్యాంగ్ లో కలిపేసుకుంటూ అప్పటికప్పుడే తీర్మానం చేసారు..ఈ లోపు అ పక్కనున్న అమ్మాయిల బృందానికి నన్ను ర్యాగింగ్ చేయాలని అనిపించింది ..ముందుగా ఎస్ డి ఆ తరువాత రకరకాల ప్రశ్నలతో నన్ను కాసేపు ఆడుకున్నారు..పైనల్ గా గీత అనే అమ్మాయి( స్టన్నింగ్ బ్యూటీ) ఏదో తిక్క ప్రశ్న వేసింది దానితో నాకు చిర్రెత్తుకొచ్చి నీకు ర్యాగింగ్ కొత్త నాకు దీనిలో రెండు సంవత్సారాల సీనియారిటి ఉంది ..పోయి పని చూసుకో అన్న మాట తో ఆ అమ్మాయి కాలేజ్ నుండి బయటికి వచ్చేంతవరకు నాతొ మాట్లాడితే ఒట్టు..ఈ విషయంలో నేను ఎన్ని సార్లు తిట్టుకున్నానో ఆ పిల్లతో గొడవ పెట్టుకున్నందుకు..అలా..అలా రెండు సెమిస్టర్ లు ముగించే సరికి మనం ఎంతో కాలేజ్ లో అందరికి తెలిసిపోయింది ..ఇక మూడవ సంవత్సరానికి రాగానే ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎప్పుడూ వస్తార అని ఎదురుచూస్తూ ఉండగా సెమిస్టర్ పరిక్షలుతో పాటు వాళ్ళు వచారు..ఒక వైపు చదువు .. మరో వైపు మద్యాహ్నం నుండి మొదటి సంవత్సరం వాళ్ళని పీక్కు తినటం..మధ్య మధ్యలో అమ్మాయిల మీద కామెంట్స్ విసరటం..మనలో మాట నేను అమ్మాయిలను బాగా కామెంట్ చేసేవాడిని ..అవి విని వాళ్ళు బాగానే ఎంజాయ్ చేసే వారు అనుకోండి .మధ్య మధ్య లో లెక్చరర్ ని టీజ్ చేయటం ..ఆ తరువాత ఇంటర్నల్ మార్కుల కోసం స్టాప్ రూం కి వెళ్లి బ్రతిమిలాడటం (దీనిలో కాలేజ్ మొత్తం మీద నన్ను మించిన వాడు లేడు)..అలా నా అల్లరి శృతి మించి రాగాన పడటం తో నా పేరు కాలేజ్ గోడల మీదకు ఎక్కింది..పాపం అమ్మాయిలుకామెంట్ చేస్తే ఏమి అనలేక వాళ్ళ వాటర్ కూలర్ దగ్గర అందం గా రాసుకున్నారు.. లెక్కల ఒక తిక్కల అని .నేను ఊరుకుంటాన దాని కింద రాసిన వారు ఒక చెక్క అని నేను రాసాను ...నా ఉహ కరెక్ట్ అయి ఆ తరువాత వారే దాని చెరిపేసారు అనుకోండి ..ఇక ఫైనల్ ఇయర్ లో నన్ను ఐటి ప్రెసిడెంట్ గా ఎన్నుకుని నన్ను అడ్డమైన పనులకి వాడుకున్నారు ..అ పంక్షన్ అని ఈ పంక్షన్ అని మా హెడ్ ఆడుకున్నాడు..ఇంకా ఎన్ని అనుభూతులు ..చిలిపి సంగతులు దాచిపెట్టాను అన్ని చెపితే బాగోదు కదా..ఎన్ని సంవత్సారాలు అయినా ఆ జ్ఞాపకాలు మన మదిలో సజీవంగానే ఉంటాయి..మరుపు రావు ఆ కాలేజి రోజులు..

 • Digg
 • Del.icio.us
 • StumbleUpon
 • Reddit
 • RSS

ఏమైంది ఈ రోజు ....


ఏమిటో ఈ రోజు నిద్ర లేచినప్పటి నుండి అమ్మ బాగా గుర్తు వస్తుంది.. దాదాపు పదిహేను సంవత్సారాల నుండి ఇంటికి దూరంగా ఉన్నా ప్రతి రోజు కలిగే ఫీలింగ్ ఈ రోజు ఎక్కువగా కలుగుతుంది .. ..1996 లో ఇంటి పక్కనున్న కాలేజ్ లో ఇంటర్ చదువుతానని నేను ..కాదు పాలిటెక్నిక్ చదవమని నాన్న ఫోర్స్ ..మొత్తం మీద నాన్న కోర్క మేరకు అమ్మకు దూరంగా పాలిటెక్నిక్ (అప్పట్లో బారతీయుడు సినిమా చూసి బ్రేక్ ఇన్స్పెక్టర్ అవుదామని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకున్నాను) చదవటానికి గుడివాడ వెళ్లాను ...అప్పట్లో ఈ కోర్సుకు భలే డిమాండ్ ఉండేది లేండి..ఇప్పుడు ఆ కాలేజ్ లు ఈగలు తోలుకుంటున్నాయి..కాలేజ్ హాస్టల్ లో నన్ను వదిలి వెళ్ళలేక అమ్మ .అమ్మా నేను హాస్టల్ కు వెళ్ళక తప్పదా !! ఇక్కడే ఉండి బాగా చదువుకుంటానమ్మా.. హాస్టల్ లో నేను ఉండలేనమ్మా.. పంపించద్దు..” కళ్ళ నిండుగా నీళ్ళు ఎపుడు దూకుదామా అని రడీగా ఉన్నాయ్ వాటిని బలవంతాన ఆపుకుంటూ బిక్కమొహం వేసుకుని అమ్మని బతిమిలాడుతున్నాను.. తన కన్నీరుని దాచుకోని వెళ్ళిన ఆ జ్ఞాపకం నా మదిలో ఇంకా సజీవంగా ఉంది బాగా చదువుకో నాన్న ..మూడు సంవత్సారాలు కష్టపడితే భవిష్యత్తు బావుంటుందని అమ్మ ఇచ్చిన సలహా..కానీ మన హోం సిక్ తో సరిగా చదివితేనా ..ఇప్పటిలా అప్పట్లో సెల్ ఫోన్ లు ఉంది ఉంటే ఎంతా బావుండేది ..రెండు రోజులకొకసారి హాస్టల్ కి చేసే ఫోన్ కోసం ఎన్ని ఎదురు చూపులో.. అందుకే రాత్రి ఎనిమిదికి చేయమనే వాడిని ఎందుకంటే అప్పుడు ఐతే అందరు డిన్నర్ కి వెళ్తారు అప్పుడు ఐతే ప్రశాంతం గా అమ్మతో మాట్లాడవచ్చని..ఎప్పుడైనా నాన్న వాళ్ళే అడ్మిన్ ఆఫీసుకు కాల్ చేస్తే ఆఫీస్ నుండి అరిచిన అరుపు విని ఎగిరిగంతేసి పొడవైన కారిడార్ లో కిందపడిపోతామేమో అన్నంత వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్ళి మాట్లాడటం ఇప్పటికీ గుర్తుంది... ఇవి కాకుండా నాన్న రాసే ఉత్తరాలు ,..ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయాని .. ఎందుకంటే అమ్మ మీద బెంగ అని చెప్పలేని భయం ..మొత్తం మీద అతి కష్టం పై మూడు సంవత్సారాలు చదువు ముగించి హమయ్య ఇక ఇంటి దగ్గర ఉండి చక్కగా జాబ్ వెతుకుందామని అనుకుంటే మల్లి అమ్మ ..నాన్న దీంతో అయితే గొర్రె తోక బెత్తెడు ఉద్యోగం వస్తుంది అని..ఇంజనీరింగ్ చేయమని గొడవ .సరే అని అది కూడా చేయటానికి బెజవాడ బయల్దేరాను..సిద్దార్థ ఇంజనీరింగ్ చేయటానికి వెళ్ళే ముందు ఆ కాలేజ్ చరిత్ర తెల్సిన అమ్మ..నాన్న ఎంత భయపడ్డారో వాళ్ళ కళ్ళు చూస్తే తెలిసేది..నన్ను కాలేజ్ లో దింపటానికి వచ్చిన నాన్న అక్కడ సీనియర్స్ తాగే సిగరెట్లు చూసి అయిన షాక్ నాకు ఇప్పటికి గుర్తే..అదే విషయాని అమ్మతో చెపితే అమ్మ అన్న మాటలు ఇంకా నా చెవుల్లో గింగురుమంటున్నాయి ..నాన్న నీకు పర్సెంటేజ్ తక్కువ వచ్చినా మేము బాదపదము..కానీ నువ్వు మాత్రం ఆ చెడు అలవాట్లు మాత్రం చేసుకోకు..అలా చేస్తే నేను తట్టుకోలేను అన్న మాటలు..నన్ను ప్రతి క్షణం అలెర్ట్ చేసేవి ..అమ్మతో మాటలంటే ఇంకో విషయం గుర్తొచ్చింది.. సాధారణంగా ఎవరితోనూ గొడవపడని నేను అప్పట్లో కాస్తైనా కోపంగా మాట్లాడేది ఒక్క అమ్మతోనే.. మాకు ముఖ్యంగా ఒక్క విషయంలో చాలా పెద్ద గొడవయ్యేది. ఇంజనీరింగ్ లో సెలవలకు వచ్చిన ప్రతిసారీ మీ స్నేహితులకోసం కూడా తీసుకువెళ్ళు అని చెప్పి పిండివంటలు పచ్చళ్ళు బోలెడు ప్యాక్ చేసేది అమ్మ. నాకేమో అవన్నీ మోసుకుని బస్సుల్లో వెళ్ళడం ఒక కష్టమయితే అసలు కాలేజికి వెళుతూ నే ఒక్కడ్నే అన్నేసి తినుబండారాలు తీసుకుని వెళ్ళడం పెద్ద నామోషీగా ఫీల్ అయ్యేవాడ్ని. మిగతావాళ్లెవరూ అన్ని తెచ్చుకునేవారు కాదు మరి అందుకే నాకలా అనిపించేది..
.అలా అలా మూడు సంవత్సారాలు(డిప్లొమా చేసిన వారు డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ కి నేరుగా వెళ్ళవచ్చు) ముగించుకొని వచ్చిన నన్ను చూసి అమ్మ ఎంత సంతోషపడిందో..అలా అలా చిన్నప్పటి అమ్మ ప్రేమను ఎంజాయ్ చేస్తుంటే సైలెంట్ గా మళ్ళి పిజీ చేయమని గొడవ ..నేను ఇక పెద్దవాడిని అయ్యాను అన్న ధైర్యం తో ఇక చదువుకి పుల్ స్టాప్ ..ఉద్యోగం చేస్తాను అని హైదరాబాద్ బయలుదేరాను..అప్పుడు కూడా అమ్మ కండ్లలో అదే కన్నీరు ..నాన్న జాగర్త రోజు ఫోన్ చేయి..వేళకు తిను .అన్న ప్రేమ మాటలు.. కొన్ని రోజులు సాప్ట్ వేర్ ఉద్యోగం వెలగ పెట్టి ఇంట్లో చెప్పకుండా మీడియా రంగంలోకి వచ్చిన అప్పుడు ..అప్పటి వరకు తుమ్మిన దగ్గినా చెప్పినా నేను ఈ విషయం మాత్రం చెప్పకపోవటం నేను చేసిన పెద్ద తప్పు.. అమ్మకి లేట్ గా చెప్పినా తను మాత్రం అదే చిరునవ్వు ..నాకు తెలుసు రా కొన్ని రోజుల నుండి నువ్వు ఏదో నా దగ్గర దాస్తున్నావు అని అన్న మాట తప్ప అయినా..ఈ జాబ్ లో నీ జీవితం బావుటుంది అనుకంటే దానిలో కంటిన్యు అవ్వు అన్న భరోసా నాకు కొన్ని లక్ష ల రెట్లు బలాన్ని ఇచ్చింది ..అదే ఇప్పుడు నా మార్గం వైపు నన్ను నడిపిస్తుంది ..పెళ్లి అయినా ఇప్పటికి రోజు వేళకు తింటున్నాన లేదా అని వాకబు..ఒక్క రోజు పని లో బిజీగా ఉండి ఫోన్ చేయకపోతే ఏమి అయిందో అని ఆదుర్ద ..అయినా అమ్మ ప్రేమకు దూరంగా ఉంటూ ఎంత సంపాదించినా ఏం లాభం ...

 • Digg
 • Del.icio.us
 • StumbleUpon
 • Reddit
 • RSS

మన కోసం మన పాట

ఆంద్ర ప్రదేశ్ ఖ్యాతి కీర్తిస్తూ ఉన్న ఈ పాట మీ కోసం

 • Digg
 • Del.icio.us
 • StumbleUpon
 • Reddit
 • RSS

పరిటాల ఆరవ వర్దంతి రోజు బయట పడ్డ నిజం


మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అయ్యింది జగన్ పరిస్థితి ..ఓ వైపు తన సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారికి హై కోర్ట్ నోటీసులు ఇచ్చి గంట గడవక ముందే ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి స్వరం పెంచాడు ...నిన్నటి వరకు మన్ను తిన్న పాము వలే ఉన్న నల్లారికి అధిష్టాన పెద్దలు ఇచ్చిన టానిక్ బాగా పనిచేస్తుంది..అందుకే ఎక్కడ అయితే జగన్ ప్రస్తుత ప్రభుత్వం తన దయా దాక్షిణ్యాల మీద నడుస్తుందని అన్నాడో అదే హస్తిన వేదిక గా జగన్ కి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు కు రాజీనామా చేసి తిరిగి గెలవమని సవాల్ విసురుతున్నాడు .ఏదో స్థల ప్రభావం వాళ్ళ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అలా అన్నాడులే అనుకుంటే ..జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్న జిల్లాలో సంచలన వ్యాఖ్యలు చేశారు..2005 ఎమ్మెల్యే హత్య కేసులో జగన్ తన దయ వల్ల బయట పడగలిగాడని..ఆయన కోసం తాను 60 రోజుల పాటు నిద్ర లేని రాత్రులు గడుపుతూ హోం వర్క్ చేసానని చెప్పారు ..తన కృషి వల్లనే జగన్ సిబిఐ కేసు నుండి బయటకి రాగాలిగాడని చెప్పుకొచ్చారు.. వైఎస్ కి నిజమైన వారసులు తాము అని ౨౦సంవత్సరాల పాటు ఆయన తో ఉన్న వారందరూ ఆయన రాజకీయ వారసులే అని సెలవిచ్చారు..జగన్ పార్టీకి చేసిన సేవలు ఏంటో చెపితే ఆయనకు పార్టీ ఏమి చేసిందో అడిగే అధికారముంటుందని అన్నారు..ఇక నుండి జగన్ వర్గం తో దాగుడు మూతలు మాని ముఖా ముఖి పోరుకు సిద్దం కావాలని వచ్చిన సూచనలు మేరకు కిరణ్ బాంబ్ వదిలాడు .. ఆ రోజు వైఎస్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పటికీ జగన్ ని బయటికి తీసుకొచ్చే బాద్యతను తన మీద పెట్టాడని సొంత కొడుకు కంటే తననే ఎక్కువ నమ్మాడని అందుకే రాజశేఖర్ రెడ్డి పేరు వాడుకునే హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉంది తప్ప జగన్ కి లేదని కొత్త బాష్యం చెప్పారు .. ఓ వైపు ఐటీ నోటీసులు మరో వైపు కోర్టు నోటిసులు ..ఇది చాలక పరిటాల హత్య లో యువనేత పాత్ర ఉందనేలా సిఎం మాటలు..దీనిపై జగన్ కౌంటర్ ఎటాక్ ఎలా చేస్తాడో చూడాలి .,..ఇన్ని నీతులు చెపుతున్న కిరణ్ గారు మరి నిండు సభలో రాజకీయ లాభం కోసం నిజాన్ని సమాది చేస్తున్నప్పుడు మీ అంతరాత్మ చెప్పలేదా.. మీరు తప్పు చేస్తున్నారని...లేక పదవీ వ్యామోహంలో దాని తొక్కి పెట్టారా..పోనీ లే ఇప్పటికైనా నిజాన్ని చెప్పారు.. మీ రాజకీయ అవసరాల కోసం ...సో పరిటాల ఆరవ వర్ధంతి రోజున ఆయన హత్య రాజకీయ హత్యే అని ..బావ కళ్ళల్లో ఆనందం కోసం జరిగిన హత్య కాదని తేలటం యాదృచ్చికం అనుకోవాలా లేక పొలిటికల్ గేమ్ అనుకోవాలా .....

 • Digg
 • Del.icio.us
 • StumbleUpon
 • Reddit
 • RSS

24 అక్బర్ రోడ్

శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరో పరిష్కార మార్గం వైపే మొగ్గుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఈపాటికే అనేక సంకేతాలనిచ్చింది. తెలంగాణాకు రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కులను కల్పిస్తూ, సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలన్న కమిటీ ఆరో సూచనను అమలు చేయడమే, తమకూ రాజకీయంగా మేలు చేస్తుందని పార్టీ నిర్ధారణకు వచ్చింది. మరోమాటలో చెప్పాలంటే, తాను కోరినా తెలంగాణా డిమాండుకు అంగీకరించే పరిస్థితిలో ప్రస్తుతం కాంగ్రెస్‌ లేదు. రాష్ట్రాన్ని విభజిస్తే, సీమాంధ్రలో జగన్‌ నాయకత్వం బలపడుతుందన్నది పార్టీ ప్రధాన ఆందోళన.

ఆంధ్రప్రదేశ్‌ మరో ఉత్తర ప్రదేశో, బీహారో కాకూడదు. దశాబ్ధాలు గడుస్తున్నా ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీ పునరుజ్జీవం సాధ్యమవ్వడం లేదు. ఆచితూచి ముందు చూపుతో వ్యవహరించకపోతే ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీకి అటువంటి ప్రమాదమే పొంచి ఉంది ' అని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు పట్ల కాంగ్రెస్‌ అగ్రనేతల్లో ఎంతటి ఆందోళన నెలకొని ఉందో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సంక్లిష్టంగా, సున్నితంగా మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవడం ఆ పార్టీకి తలకు మించిన భారంగా తయారయ్యింది. జమ్మూ కాశ్మీర్‌ అల్లర్ల తరువాత ఇటీవలి కాలంలో పార్టీకి ఎదురైన అతిపెద్ద పరీక్ష ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలే. ప్రత్యేక తెలంగాణా డిమాండు, జగన్‌ తిరుగుబాటు రెండు వేర్వేరు సమస్యలు కాకపోగా...ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న రాజకీయ సవాళ్లు. ఈ కారణంగానే హస్తం పార్టీ నేతల్లో రాష్ట్రానికి సంబంధించి మునుపెన్నడూ లేని డైలమా ఆవరించింది. ప్రస్తుత రాజకీయ సుడిగుండం నుండి పార్టీని అతి తక్కువ నష్టంతో బయట పడేయడం పైనే ఇప్పుడు అగ్రనేతలు దృష్టి సారించారు. మరో మూడేళ్లూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి పావులు కదుపుతున్నారు.

'ఆరే' ప్రాణం !

ప్రత్యేక తెలంగాణా డిమాండుపై ఇప్పటివరకూ నాన్చుడి ధోరణి అవలంభించిన కాంగ్రెస్‌కు...శ్రీకృష్ణ కమిటీ నివేదికపై మాత్రం ఏదో ఒకటి తేల్చాల్సిన అనివార్యత ఏర్పడింది. కమిటీ సూచించిన ఆరో పరిష్కార మార్గం వైపే మొగ్గుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఈపాటికే అనేక సంకేతాలనిచ్చింది. తెలంగాణాకు రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కులను కల్పిస్తూ, సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలన్న కమిటీ ఆరో సూచనను అమలు చేయడమే, తమకూ రాజకీయంగా మేలు చేస్తుందని పార్టీ నిర్ధారణకు వచ్చింది. మరోమాటలో చెప్పాలంటే, తాను కోరినా తెలంగాణా డిమాండుకు అంగీకరించే పరిస్థితిలో ప్రస్తుతం కాంగ్రెస్‌ లేదు. రాష్ట్రాన్ని విభజిస్తే, సీమాంధ్రలో జగన్‌ నాయకత్వం బలపడుతుందన్నది పార్టీ ప్రధాన ఆందోళన. జగన్‌ తిరుగుబాటు నేపథ్యంలో పిఆర్పీ, ఎంఐఎం మద్దతుపైనే రాష్ట్ర ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉందన్నది బహిరంగ రహస్యం. ఈ రెండు పార్టీలూ రాష్ట్ర విభజనకు పూర్తిగా వ్యతిరేకం. తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్‌సిపి తదితర పార్టీలు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సుముఖంగా లేవు. బెంగాల్‌ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో మమతా బెనర్జీతో పాటు ప్రణబ్‌ ముఖర్జీ కూడా చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశంపై చికాకు ప్రదర్శిస్తున్నారు. తమ రాష్ట్రంలో గూర్ఖాలాండ్‌ డిమాండును ఈ నేతలిద్దరూ వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. ఇన్ని ప్రతికూలతల మధ్య కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం చేయడం దాదాపుగా అసాధ్యమే ! ఈ నేపథ్యంలో తెలంగాణా అనుకూల ఆందోళనలను చల్లబరచడంపై పార్టీ దృష్టి సారించింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక బహిర్గతమైన అనంతరం కెసిఆర్‌ వ్యవహారశైలిపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. కెసిఆర్‌ది వ్యూహమో...మౌనమో కొద్దిరోజుల్లో తేలిపోనుంది. ఇక పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకోవచ్చన్న ధీమా కాంగ్రెస్‌ అధిష్టానంలో కనబడుతోంది. ఒకరిద్దరని మినహాయిస్తే, ఎంపీల్లో ఎక్కువ మంది ఇప్పటికీ పార్టీకే విధేయులుగా ఉన్నారు. మొత్తంగా తెలంగాణా ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలను అదుపులో పెట్టుకోవడానికి కాంగ్రెస్‌ 'అన్ని అవకాశాలనూ' పరిశీలిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవిపై రెండు నెలలుగా ఊరించడమే ఇందుకు చిన్న ఉదాహరణ. తెలంగాణా ఇవ్వబోవడం లేదని నేరుగా చెప్పేందుకూ పార్టీ సిద్ధంగా లేదు. ఇదే విషయాన్ని తియ్యటి మాటలతో ఎలా చెప్పాలన్న దానిపై ఇప్పుడు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో పార్టీ ఎంతవరకూ విజయం సాధిస్తుందో ఇప్పుడే అంచనా వేయడం కష్టమే.

వ్యూహ ప్రతివ్యూహాలు

మరోవైపు వైఎస్‌ జగన్‌ బలం, బలగాలను కాంగ్రెస్‌ అధిష్టానం నిశితంగా గమనిస్తోంది. ఢిల్లీలో ఇటీవల జరిగిన 'బల దీక్ష'నూ పార్టీ నింపాదిగానే పరిశీలించింది. ప్రస్తుతం జగన్‌ వెంట నడుస్తోన్న సుమారు పాతికమంది ఎమ్మెల్యేలతో తమకు తక్షణం నష్టం లేదని పార్టీ భావిస్తోంది. శాసనసభకు ఎన్నికలు జరిగితే... జగన్‌ ఏమేరకు ప్రభావం చూపుతారన్న అంశంపై 294 స్థానాల్లోనూ పార్టీ ఈపాటికే ప్రాథమిక సర్వే చేసింది. ఎన్నికలను ఎంతకాలం వాయిదా వేయగలిగితే తమకు అంత మేలని నిర్ధారణకు వచ్చింది. మరోవైపు జగన్‌ కూడా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌ నుండి బయటికి వచ్చి దాదాపుగా రెండు నెలలవుతున్నా, ఆయన సొంత పార్టీని ప్రకటించకపోవడం వెనుక వ్యూహం దాగుంది. నవంబర్‌ 29న కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జగన్‌, జనవరి ఐదున కొత్త పార్టీ కోసం ఎన్నికల సంఘంలో దరఖాస్తు చేయడం గమనార్హం. ప్రత్యేక తెలంగాణా అంశం తేలే వరకూ అధికారికంగా పార్టీని ప్రకటించకూడదన్న ఉద్దేశంతోనే ఆయన ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారు. తెలంగాణాపై కేంద్రం నిర్ణయం వెలువడక ముందే పార్టీని ప్రకటిస్తే...రాష్ట్ర విభజనపై తన ఎజెండా ఏమిటో ఆయన చెప్పాల్సి ఉంటుంది. సమైక్యాంధ్రకు అనుకూలంగా ఒకడుగు ముందుకేసిన జగన్‌కు అది సాధ్యం కాదు. కేంద్రం నిర్ణయం వెలువడ్డాకైతే...రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా జెండా, ఎజెండాను రూపొందించుకునే అవకాశం లభిస్తుంది. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకూ వీలవుతుంది.

మూడే మార్గాలు

తెలంగాణా ఉద్యమాన్ని, జగన్‌ తిరుగుబాటును ఏకకాలంలో తట్టుకోవాలంటే, రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల పాటు కొనసాగడం అత్యంత ప్రధానమని కాంగ్రెస్‌ భావిస్తోంది. వాస్తవానికి మైనార్టీలో పడిన ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు, పార్టీ మూడు మార్గాలను నిర్ణయించుకుంది. పిఆర్పీ, ఎంఐఎం, స్వతంత్రుల మద్దతు ఆధారంగా కొనసాగడం మొదటిది. ఇది సాధ్యంకాని పరిస్థితుల్లో, జగన్‌ శిబిరంలోని ఎంపిక చేసిన కొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం. ఈ రెండు మార్గాలూ ఫలించకపోతే, రాష్ట్రపతి పాలన విధించడం మూడవది. ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో మొదటి రెండు మార్గాలతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణా ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకోవడంలో కాంగ్రెస్‌ విజయవంతమైతే, ప్రభుత్వానికి ముప్పు లేనట్లే. ' మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పడిపోదు. లెక్కలు వచ్చినోళ్లు..లెక్కలేసుకోండి ' అని పిసిసి అధ్యక్షుడు డిఎస్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవముంది. తన వెంట ఇప్పుడున్న పాతిక మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని పడగొట్టడం జగన్‌కు అసాధ్యమే. వాస్తవంగా బలాబలాలను పరిశీలిస్తే, మరో పాతిక మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే కానీ జగన్‌ ప్రభుత్వాన్ని కూల్చలేరన్నది స్పష్టం. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా జగన్‌కు పూర్తి స్థాయి విధేయత ప్రకటించేందుకు సిద్ధపడని స్థితిలో... మరో పాతిక మంది నిక్కచ్చిగా ఆయన వెంట నడుస్తారనుకోలేము.

 • Digg
 • Del.icio.us
 • StumbleUpon
 • Reddit
 • RSS

జ్ఞాపకం

అభివృద్ధి పధంలొ మనం వదిలేసి వచ్చిన మరో చక్కని జ్ఞాపకం గ్రీటింగ్ కార్డ్ ..వేల ఎస్సెమెస్స్ లు వచ్చినా చిన్నప్పుడు పోస్టులో అందుకున్న పావలా గ్రీటింగ్ కార్డ్ అనుభూతిని అందించలేకపొతున్నాయి..టెక్నాలజీ పెరిగిందని ఆనందపడాలో మనకు తెలియకుండానే ..మన ఆనందాలు అన్నీ మరుగున పడుతున్నాయి అని బాధపడాలో..నిజంగా నాచిన్నప్పుడు రూపాయలకు పెద్ద గ్రీటింగ్ షీట్ వచ్చేది ..దాని కట్ చేసి మన ఫ్రెండ్స్ కి ఇస్తే ఆనందమే వేరు..కానీ ఇప్పుడు మనకు అంతా తీరిక లేదు అంతా ఓపికా లేదుఎంచక్కా అంతర్జాలం ముందు కూర్చుని నచ్చిన గ్రీటింగ్ ని ఈమెయిల్ చేస్తే పని అయిపోతుంది లేకపోతె ఒక ఎస్సెమెస్స్ పంపితే సరి..టెక్నాలజీ పెరిగిన తరువాత మనబంధాలు అన్ని కృత్రిమంగా అయిపోతున్నాయి..దీని ఎవరు మార్చలేరు నిట్టూర్పు వదలటం తప్ప....

 • Digg
 • Del.icio.us
 • StumbleUpon
 • Reddit
 • RSS

శ్రీ కృష్ణ కమిటీ రిపోర్టు తేనెలొలుకు తెలుగు లో

శ్రీ కృష్ణ కమిటీ రిపోర్టు తేనెలొలుకు తెలుగు లో

 • Digg
 • Del.icio.us
 • StumbleUpon
 • Reddit
 • RSS