RSS

24 అక్బర్ రోడ్

శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరో పరిష్కార మార్గం వైపే మొగ్గుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఈపాటికే అనేక సంకేతాలనిచ్చింది. తెలంగాణాకు రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కులను కల్పిస్తూ, సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలన్న కమిటీ ఆరో సూచనను అమలు చేయడమే, తమకూ రాజకీయంగా మేలు చేస్తుందని పార్టీ నిర్ధారణకు వచ్చింది. మరోమాటలో చెప్పాలంటే, తాను కోరినా తెలంగాణా డిమాండుకు అంగీకరించే పరిస్థితిలో ప్రస్తుతం కాంగ్రెస్‌ లేదు. రాష్ట్రాన్ని విభజిస్తే, సీమాంధ్రలో జగన్‌ నాయకత్వం బలపడుతుందన్నది పార్టీ ప్రధాన ఆందోళన.

ఆంధ్రప్రదేశ్‌ మరో ఉత్తర ప్రదేశో, బీహారో కాకూడదు. దశాబ్ధాలు గడుస్తున్నా ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీ పునరుజ్జీవం సాధ్యమవ్వడం లేదు. ఆచితూచి ముందు చూపుతో వ్యవహరించకపోతే ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీకి అటువంటి ప్రమాదమే పొంచి ఉంది ' అని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు పట్ల కాంగ్రెస్‌ అగ్రనేతల్లో ఎంతటి ఆందోళన నెలకొని ఉందో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సంక్లిష్టంగా, సున్నితంగా మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవడం ఆ పార్టీకి తలకు మించిన భారంగా తయారయ్యింది. జమ్మూ కాశ్మీర్‌ అల్లర్ల తరువాత ఇటీవలి కాలంలో పార్టీకి ఎదురైన అతిపెద్ద పరీక్ష ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలే. ప్రత్యేక తెలంగాణా డిమాండు, జగన్‌ తిరుగుబాటు రెండు వేర్వేరు సమస్యలు కాకపోగా...ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న రాజకీయ సవాళ్లు. ఈ కారణంగానే హస్తం పార్టీ నేతల్లో రాష్ట్రానికి సంబంధించి మునుపెన్నడూ లేని డైలమా ఆవరించింది. ప్రస్తుత రాజకీయ సుడిగుండం నుండి పార్టీని అతి తక్కువ నష్టంతో బయట పడేయడం పైనే ఇప్పుడు అగ్రనేతలు దృష్టి సారించారు. మరో మూడేళ్లూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి పావులు కదుపుతున్నారు.

'ఆరే' ప్రాణం !

ప్రత్యేక తెలంగాణా డిమాండుపై ఇప్పటివరకూ నాన్చుడి ధోరణి అవలంభించిన కాంగ్రెస్‌కు...శ్రీకృష్ణ కమిటీ నివేదికపై మాత్రం ఏదో ఒకటి తేల్చాల్సిన అనివార్యత ఏర్పడింది. కమిటీ సూచించిన ఆరో పరిష్కార మార్గం వైపే మొగ్గుతున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఈపాటికే అనేక సంకేతాలనిచ్చింది. తెలంగాణాకు రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కులను కల్పిస్తూ, సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలన్న కమిటీ ఆరో సూచనను అమలు చేయడమే, తమకూ రాజకీయంగా మేలు చేస్తుందని పార్టీ నిర్ధారణకు వచ్చింది. మరోమాటలో చెప్పాలంటే, తాను కోరినా తెలంగాణా డిమాండుకు అంగీకరించే పరిస్థితిలో ప్రస్తుతం కాంగ్రెస్‌ లేదు. రాష్ట్రాన్ని విభజిస్తే, సీమాంధ్రలో జగన్‌ నాయకత్వం బలపడుతుందన్నది పార్టీ ప్రధాన ఆందోళన. జగన్‌ తిరుగుబాటు నేపథ్యంలో పిఆర్పీ, ఎంఐఎం మద్దతుపైనే రాష్ట్ర ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉందన్నది బహిరంగ రహస్యం. ఈ రెండు పార్టీలూ రాష్ట్ర విభజనకు పూర్తిగా వ్యతిరేకం. తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్‌సిపి తదితర పార్టీలు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సుముఖంగా లేవు. బెంగాల్‌ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో మమతా బెనర్జీతో పాటు ప్రణబ్‌ ముఖర్జీ కూడా చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశంపై చికాకు ప్రదర్శిస్తున్నారు. తమ రాష్ట్రంలో గూర్ఖాలాండ్‌ డిమాండును ఈ నేతలిద్దరూ వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. ఇన్ని ప్రతికూలతల మధ్య కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం చేయడం దాదాపుగా అసాధ్యమే ! ఈ నేపథ్యంలో తెలంగాణా అనుకూల ఆందోళనలను చల్లబరచడంపై పార్టీ దృష్టి సారించింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక బహిర్గతమైన అనంతరం కెసిఆర్‌ వ్యవహారశైలిపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. కెసిఆర్‌ది వ్యూహమో...మౌనమో కొద్దిరోజుల్లో తేలిపోనుంది. ఇక పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకోవచ్చన్న ధీమా కాంగ్రెస్‌ అధిష్టానంలో కనబడుతోంది. ఒకరిద్దరని మినహాయిస్తే, ఎంపీల్లో ఎక్కువ మంది ఇప్పటికీ పార్టీకే విధేయులుగా ఉన్నారు. మొత్తంగా తెలంగాణా ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలను అదుపులో పెట్టుకోవడానికి కాంగ్రెస్‌ 'అన్ని అవకాశాలనూ' పరిశీలిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవిపై రెండు నెలలుగా ఊరించడమే ఇందుకు చిన్న ఉదాహరణ. తెలంగాణా ఇవ్వబోవడం లేదని నేరుగా చెప్పేందుకూ పార్టీ సిద్ధంగా లేదు. ఇదే విషయాన్ని తియ్యటి మాటలతో ఎలా చెప్పాలన్న దానిపై ఇప్పుడు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో పార్టీ ఎంతవరకూ విజయం సాధిస్తుందో ఇప్పుడే అంచనా వేయడం కష్టమే.

వ్యూహ ప్రతివ్యూహాలు

మరోవైపు వైఎస్‌ జగన్‌ బలం, బలగాలను కాంగ్రెస్‌ అధిష్టానం నిశితంగా గమనిస్తోంది. ఢిల్లీలో ఇటీవల జరిగిన 'బల దీక్ష'నూ పార్టీ నింపాదిగానే పరిశీలించింది. ప్రస్తుతం జగన్‌ వెంట నడుస్తోన్న సుమారు పాతికమంది ఎమ్మెల్యేలతో తమకు తక్షణం నష్టం లేదని పార్టీ భావిస్తోంది. శాసనసభకు ఎన్నికలు జరిగితే... జగన్‌ ఏమేరకు ప్రభావం చూపుతారన్న అంశంపై 294 స్థానాల్లోనూ పార్టీ ఈపాటికే ప్రాథమిక సర్వే చేసింది. ఎన్నికలను ఎంతకాలం వాయిదా వేయగలిగితే తమకు అంత మేలని నిర్ధారణకు వచ్చింది. మరోవైపు జగన్‌ కూడా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌ నుండి బయటికి వచ్చి దాదాపుగా రెండు నెలలవుతున్నా, ఆయన సొంత పార్టీని ప్రకటించకపోవడం వెనుక వ్యూహం దాగుంది. నవంబర్‌ 29న కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జగన్‌, జనవరి ఐదున కొత్త పార్టీ కోసం ఎన్నికల సంఘంలో దరఖాస్తు చేయడం గమనార్హం. ప్రత్యేక తెలంగాణా అంశం తేలే వరకూ అధికారికంగా పార్టీని ప్రకటించకూడదన్న ఉద్దేశంతోనే ఆయన ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారు. తెలంగాణాపై కేంద్రం నిర్ణయం వెలువడక ముందే పార్టీని ప్రకటిస్తే...రాష్ట్ర విభజనపై తన ఎజెండా ఏమిటో ఆయన చెప్పాల్సి ఉంటుంది. సమైక్యాంధ్రకు అనుకూలంగా ఒకడుగు ముందుకేసిన జగన్‌కు అది సాధ్యం కాదు. కేంద్రం నిర్ణయం వెలువడ్డాకైతే...రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా జెండా, ఎజెండాను రూపొందించుకునే అవకాశం లభిస్తుంది. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకూ వీలవుతుంది.

మూడే మార్గాలు

తెలంగాణా ఉద్యమాన్ని, జగన్‌ తిరుగుబాటును ఏకకాలంలో తట్టుకోవాలంటే, రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల పాటు కొనసాగడం అత్యంత ప్రధానమని కాంగ్రెస్‌ భావిస్తోంది. వాస్తవానికి మైనార్టీలో పడిన ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు, పార్టీ మూడు మార్గాలను నిర్ణయించుకుంది. పిఆర్పీ, ఎంఐఎం, స్వతంత్రుల మద్దతు ఆధారంగా కొనసాగడం మొదటిది. ఇది సాధ్యంకాని పరిస్థితుల్లో, జగన్‌ శిబిరంలోని ఎంపిక చేసిన కొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం. ఈ రెండు మార్గాలూ ఫలించకపోతే, రాష్ట్రపతి పాలన విధించడం మూడవది. ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో మొదటి రెండు మార్గాలతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణా ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకోవడంలో కాంగ్రెస్‌ విజయవంతమైతే, ప్రభుత్వానికి ముప్పు లేనట్లే. ' మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పడిపోదు. లెక్కలు వచ్చినోళ్లు..లెక్కలేసుకోండి ' అని పిసిసి అధ్యక్షుడు డిఎస్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవముంది. తన వెంట ఇప్పుడున్న పాతిక మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని పడగొట్టడం జగన్‌కు అసాధ్యమే. వాస్తవంగా బలాబలాలను పరిశీలిస్తే, మరో పాతిక మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే కానీ జగన్‌ ప్రభుత్వాన్ని కూల్చలేరన్నది స్పష్టం. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా జగన్‌కు పూర్తి స్థాయి విధేయత ప్రకటించేందుకు సిద్ధపడని స్థితిలో... మరో పాతిక మంది నిక్కచ్చిగా ఆయన వెంట నడుస్తారనుకోలేము.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment